బిజెపికి భిక్షమయ్య గౌడ్... రామ్ రామ్!

టిఆర్ఎస్‌ వికెట్ (బూర నర్సయ్య గౌడ్‌)ని బిజెపి పడగొడితే, బిజెపి వికెట్ (భిక్షమయ్య గౌడ్)ని టిఆర్ఎస్‌ పడగొట్టి కుల సమీకరణాలను బ్యాలన్స్ చేసింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఈరోజు హటాత్తుగా బిజెపికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి సహాయపడుతుందనే ఉద్దేశ్యంతోనే నేను బిజెపిలో చేరాను. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా విదిలించడం లేదు. 

ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర బిజెపి నేతలు ఎప్పుడూ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకొంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరధకు నిధులు మంజూరు చేయాలని ఆర్ధిక సంఘం చెప్పినా పైసా విదిలించలేదు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చింది కానీ పట్టించుకోలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం అన్ని అవమానాలను దిగమింగుకొంటూ బిజెపిలో కొనసాగాను. బిజెపిలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. కనీసం గౌరవం లేదు. కనుక తెలంగాణ పట్ల బిజెపి ఇంతగా వివక్ష చూపుతుంటే ఇంకా నేను ఆ పార్టీలో ఉండటం సబబు కాదని భావించి బయటకు వచ్చేస్తున్నాను,” అని అన్నారు. 

భిక్షమయ్య గౌడ్‌ విమర్శలు అన్నీ టిఆర్ఎస్‌ నేతల నోట్లో మాటల్లా మూసపోసినట్లున్నాయి. కనుక త్వరలోనే టిఆర్ఎస్‌ జెరాడం ఖాయమే అని భావించవచ్చు.