మునుగోడు ఉపఎన్నికల బరిలో ఉన్న 8 మంది స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించిన ఎన్నికల గుర్తులు టిఆర్ఎస్ ఎన్నికల చిహ్నామైన కారు గుర్తును పోలి ఉన్నాయని వాటిని మార్చాలని కోరుతూ టిఆర్ఎస్ హైకోర్టుకి వెళ్ళినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. గత ఉపఎన్నికలలో కూడా ఇటువంటి ఎన్నికల గుర్తుల వలన టిఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. కనుక మళ్ళీ ఈసారి కూడా అలాగే జరుగుతుందని ఆందోళన చెందుతోంది.
యుగతులసి పార్టీ అభ్యర్ధి కె.శివకుమార్‌కు కేంద్ర ఎన్నికల కమీషన్ రోడ్ రోలర్ గుర్తుని కేటాయించగా మునుగోడు రిటర్నింగ్ అధికారి నిన్న దానిని ‘బేబీ వాకర్’గా మార్చేశారు. దీనిపై కె.శివకుమార్ నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందిస్తూ ఆయనకు మళ్ళీ రోడ్ రోలర్ గుర్తుని కేటాయిస్తూ జాబితాను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
తాము కేటాయించిన ఎన్నికల గుర్తును రిటర్నింగ్ అధికారి ఎందుకు మార్చవలసి వచ్చిందో విచారణ జరిపి ఈరోజు సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దాంతోపాటు రిటర్నింగ్ అధికారి వివరణను కూడా జత చేసి పంపాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఫారం 7(ఏ)ను సవరించి మళ్ళీ కె.శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తుని కేటాయించారు. ఈ ప్రకారమే బ్యాలెట్ పేపర్లను ముద్రించబోతున్నారు.
ఉపఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధులలో ఏ ఒక్కరూ గెలిచే అవకాశం లేదు. కానీ ఓట్లు చీల్చి మూడు ప్రధాన పార్టీలకు ఎంతో కొంత నష్టం కలిగించచగలరు. రోడ్ రోలర్ గుర్తుతో ఎక్కువ నష్టపోయేది టిఆర్ఎస్ పార్టీయే కనుక ఆ పార్టీకి చెందినవారెవరో తమ ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి గుర్తు మార్పించి ఉండవచ్చు. లేదా టిఆర్ఎస్‌కు నష్టం తగ్గించాలనే ఉద్దేశ్యంతో రిటర్నింగ్ అధికారే ఈ మార్పు చేసి ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఎన్నికల కమీషన్ ఆయనపై చర్యలు తీసుకోవడం తధ్యం.