మునుగోడులో జేపీ నడ్డాకి సమాధి కట్టి దండేసి...

రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయా అనిపించక మానదు ఈ దుశ్చర్య చూస్తే. మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు చౌటుప్పల్ మండలంలో దండుమల్కాపూర్ గ్రామంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోటో పెట్టి సమాధి కట్టారు. దానిపై దండేసి పసుపు కుంకుమ చల్లారు. దాని వెనుక ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ బ్యానర్‌పై ‘రీజియనల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, చౌటుప్పల్’ అని వ్రాసి ఉంది. 

దీనిపై రాష్ట్ర బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ఇంత నీచానికి దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నారు. తక్షణం సమాధిని తొలగించి కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని బిజెపి నేత మనోహర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమీషన్‌కి కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.   

అయితే దీనితో తమకు ఎటువంటి సంబందమూ లేదని టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. స్థానిక ఫ్లోరైడ్ బాధితులే ఈవిదంగా నిరసన తెలిపి ఉండవచ్చని చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదివరకు జేపీ నడ్డా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2016లో మునుగోడులో పర్యటించి చౌటుప్పల్‌లో రీజియనల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే చౌటుప్పల్‌లో 8.2 ఎకరాలు కేటాయించింది కూడా. ప్రభుత్వం కేటాయించిన ఆ భూమిలోనే ఈ సమాధి వెలిసింది.