బిజెపి బూర ఊదేశారు... నర్సయ్య గౌడ్‌!

టిఆర్ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ బుదవారం ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భూపేంద్ర యాదవ్, తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్‌ చార్జ్ తరుణ్‌ఛుగ్‌, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ కె.లక్ష్మణ్ తదితరుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బిజెపిలో చేరిపోయారు. పార్టీలో చేరిన తర్వాత మొక్కుబడిగా పలకాల్సిన ఆ నాలుగు ముక్కలు... అంటే “మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది. మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధిలో పాలు పంచుకొంటాను. సబ్ కా సాత్… సబ్ కా వికాస్” వంటివన్నీ గడగడా చెప్పేశారు. 

కనుక ఇక నుంచి ఆయన బిజెపి హిందుత్వ ఆలోచనలు అలవరుచుకొని, తెలంగాణలో అడుగుపెట్టగానే సిఎం కేసీఆర్‌ నిరంకుశ పాలన గురించి, టిఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతి గురించి గట్టిగా మాట్లాడవలసి ఉంటుంది. ఆయన బిజెపిలో చేరే ముందు సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు కాషాయకండువా కప్పుకొన్నారు కనుక పూర్తి స్వేచ్చలభించినట్లే. 

వచ్చే ఎన్నికలలోగా ఆయన ఈ విషయంలో తన సామర్ధ్యం నిరూపించుకొనేందుకు అవకాశం కూడా ఉంది. ముందుగా మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం కోసం పనిచేసి తన చిత్తశుద్ధి, దీక్షాదక్షతలను బూర నర్సయ్య గౌడ్‌ నిరూపించుకోవలసి ఉంటుంది.