హైకోర్టులో టిఆర్ఎస్కు ఎదురుదెబ్బ
మునుగోడు ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులకు టిఆర్ఎస్ ఎన్నికల చిహ్నామైన కారును పోలిన గుర్తులు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో టిఆర్ఎస్ హైకోర్టులో నిన్న లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఇప్పటికే అభ్యర్ధులందరికీ ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించినందున, ఈ వ్యవహారంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెపుతూ టిఆర్ఎస్ పిటిషన్ కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నికలలో సుమారు 8 మందికి కారును పోలిన గుర్తులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వమే ఎన్నికల కమీషన్‌పై ఒత్తిడి చేసి టిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈ కుట్ర పన్నిందని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
నేనున్నాను... పాల్వాయి స్రవంతికి వెంకట్ రెడ్డి ఆశీర్వాదం
మునుగోడు ఉపఎన్నికలలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నందున ఈ ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి నిన్న గాంధీ భవన్లో కలిసినప్పుడు చేతులు జోడించి తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అభ్యర్ధించారు. పార్టీలో మీ వంటి హేమాహేమీలు చాలా మందే ఉన్నప్పటికీ మునుగోడులో ఒంటరి పోరాటం చేయవలసివస్తోందని ఆమె కన్నీళ్ళు పెట్టుకొన్నారు. అది చూసి కరిగిపోయిన వెంకట్ రెడ్డి, ఆమె తలపై చేయుంచి ఆశీర్వదించి “నేనున్నాను... భయపడకమ్మా...” అంటూ ఓదార్చారు. అంటే ఆమె తరపున మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారా?వస్తే ఉపఎన్నికలలో పార్టీల బలాబలాలు మారిపోవడం ఖాయం.