
మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కూడా నేటితో ముగిసింది. మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా వారిలో 47 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలినవారిలో 36మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. కనుక ఇప్పుడు బరిలో 47 మంది అభ్యర్ధులు మిగిలారు. అయితే ఈసారి కూడా టిఆర్ఎస్కు కారు గుర్తుతో ఇబ్బంది వస్తోంది. ఈ ఉపఎన్నికలలో కూడా 8 మందికి కారును పోలిన ట్రాక్టర్, ఆటో, రోడ్ రోలర్ వంటి గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.
గతంలో ఇటువంటి గుర్తులతో ఓటర్లు అయోమయానికి గురై తమకు బదులు వేరే అభ్యర్ధులకు ఓట్లేసారని కనుక ఆ 8 ఎన్నికల గుర్తులను మార్చాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ ఓ లేఖ వ్రాసింది. కానీ ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో టిఆర్ఎస్ నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, ఇదేమీ అత్యవసర విషయం కాదు కనుక మంగళవారం విచారణ జరుపుతామని చెప్పారు.
ఇదికాక మునుగోడు ఉపఎన్నికల అభ్యర్డులలో కోమటిరెడ్డి ఇంటిపేరుతో ఉన్నవారు నలుగురు ఉన్నట్లు సమాచారం. వారి వలన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు.