జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన రసాభాసగా మారింది. ఆయన మూడు రోజులు ఉత్తరాంద్ర జిల్లాలలో పర్యటించాలని హైదరాబాద్ నుంచి శనివారం మధ్యాహ్నం విమానంలో విశాఖకు బయలుదేరారు. అదే సమయంలో విశాఖలో బహిరంగసభ ముగించుకొన్న ఆర్కె. రోజా తదితర వైసీపీ మంత్రులు విమానాశ్రయం చేసుకొన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలు వారిని చూడగానే తీవ్ర ఆగ్రహావేశాలతో వారి కార్లపై రాళ్ళు, చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు 64 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
ఈ ఉద్రిక్తతల మద్య విశాఖ విమానాశ్రయంలో దిగిన పవన్ కళ్యాణ్ వారితో కలిసి ర్యాలీగా వైజాగ్ బీచ్ రోడ్డులోని నోవా టెల్ హోటల్ చేరుకొన్నారు. శనివారం రాత్రి పోలీసులు హోటల్లోకి ప్రవేశించి అక్కడ బస చేసిన జనసేన ముఖ్య నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో వారిని బేషరతుగా విడుదల చేసేవరకు విశాఖ నుంచి కదలబోనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చివరికి జనసేన కార్యకర్తలందరినీ వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌ను హోటల్ గదిలో నిర్బందించి, బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకొన్నారు. అలాగే బీచ్ రోడ్డులో వందలాదిమంది పోలీసులను మోహరించి జనసేన కార్యకర్తలు ఎవరూ అటువైపు రాకుండా అడ్డుకొంటున్నారు.
పోలీసు అధికారులతో చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపటిలో విజయవాడ బయలుదేరేందుకు సిద్దం అవుతున్నారు. బీచ్ రోడ్డు నుంచి విమానాశ్రయం సుమారు 10-15 కిమీ దూరం ఉంటుంది. కనుక దారి పొడవునా పోలీసులను మోహరించి జనసేన కార్యకర్తలు ఎవరూ తమ అధినేతను కలవకుండా అడ్డుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం ఏపీ గవర్నర్ బిశ్వాభూషన్ హరిచందన్‌ను కలిసి జగన్ ప్రభుత్వంపై, పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు.