అవును...
టిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గురువారం ఉదయం పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల
ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రోజు
రాత్రి ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలతో సమావేశమయ్యి ఆ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు!
ఇంతకీ
ఏం జరిగిందంటే, ఆయన గత ఎన్నికలలో ఓడిపోవడంతో ఇప్పుడు మునుగోడు నుంచి పోటీ చేయాలని అనుకొన్నారు.
కానీ సిఎం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి
చెందారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్ తదితరులు ఆయనకు నచ్చజెప్పడంతో
శాంతించి కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే అంతకు ముందు
నుంచే రాష్ట్ర బిజెపి నేతలు ఆయనతో టచ్చులో ఉన్నారు. బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించారు.
ఇప్పుడు బిజెపిలో చేరేందుకు మునుగోడులో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదనే బలమైన కారణం దొరికింది గనుక గురువారం రాత్రే ఆయన కొంత మంది ముఖ్య అనుచరులను వెంటబెట్టుకొని ఢిల్లీ చేరుకొన్నారు. అక్కడ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. ఇవాళ్ళ ఉదయం అమిత్ అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య, అనుచరులు కాషాయ కండువాలు కప్పుకొని బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.
సిఎం కేసీఆర్ ఇంకా
ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అక్కడ జాతీయపార్టీ కోసం సన్నాహాలు చేసుకొంటుండగా, టిఆర్ఎస్లో సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ బిజెపిలో చేరి ఆయనకు పెద్ద షాక్
ఇవ్వబోతున్నారు. మరో టిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నేప్రభాకర్
కూడా బిజెపితో టచ్చులో ఉన్నట్లు సమాచారం.