హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ

కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఈరోజు మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 68 స్థానాలకు ఒకే దశలో నవంబర్‌ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 17వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసి అదే రోజు నుంచి 25వరకు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అక్టోబర్‌ 27న నామినేషన్ల పరిశీలన, 29వరకు ఉపసంహరణ గడువు, నవంబర్‌ 12న పోలింగ్,  డిసెంబర్‌ 8వ తేదీన ఓట్ల లెక్కించి ఆదేరోజున ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమీషన్‌ తెలిపింది. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ డిసెంబర్‌లోగా నిర్వహించవలసి ఉంది. కనుక రెంటికీ కలిపి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని భావిస్తే హిమాచల్ ప్రదేశ్ ఒక్కదానికే షెడ్యూల్ ప్రకటించింది. అయితే రెండు మూడు రోజులలో గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బహుశః అందుకే హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ నవంబర్‌ 12న ముగిస్తే ఫలితాలు ప్రకటించడానికి మద్యలో మూడు వారాల గడువు పెట్టి ఉండవచ్చు. కనుక రెండు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్‌ 8వ తేదీన వెలువడే అవకాశం ఉందని భావించవచ్చు.