మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలు వాటితో పాటు తన ఆస్తుల వివరాలు తెలియజేస్తూ అఫిడవిట్ ఎన్నికల అధికారికి సమర్పించారు. దాని ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.7.68 కోట్లు. వాటిలో స్థిరాస్తుల విలువ రూ.3.89 కోట్లు కాగా చరాస్తుల విలువ రూ.379 కోట్లు అని పేర్కొన్నారు. తన భార్య అరుణారెడ్డి పేరిట రూ.6.10 కోట్లు ఆస్తులున్నట్లు తెలిపారు. వాటిలో స్థిరాస్తులు రూ.3.84 కోట్లు, చరాస్తులు రూ.2.26 కోట్లు అని పేర్కొన్నారు.
తనకు ఒక కోటి 78 లక్షలు అప్పులున్నాయని, భార్యకు రూ.22.95 లక్షలు అప్పులున్నాయని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
అధికార పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.13.78 కోట్లు కాగా ప్రతిపక్ష బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి ఆస్తుల విలువ రూ. 24.69 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కనుక ముగ్గురు ప్రధాన అభ్యర్ధులలో అత్యంత ధనవంతుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని స్పష్టం అవుతోంది. కనుక ఎన్నికలలో ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరో కూడా ముందే స్పష్టం అవుతోంది.