8.jpg)
మునుగోడు ఉపఎన్నికలు సమీపిస్తుండటంతో టిఆర్ఎస్, బిజెపి నేతల మద్య మాటల యుద్ధం రోజురోజుకీ తీవ్రం అవుతోంది. ఈరోజు ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. “కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనేందుకు ఆయనకి రూ.18,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. అదే నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ.22,000 కోట్లు ఇస్తామంటే మేము ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నాము,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.
“జిల్లా అభివృద్ధికి, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రధాని నరేంద్రమోడీకి చేతులు రావు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18,000 కోట్లు, ఆదానీకి శ్రీలంకలో రూ.6,000 కోట్లు కాంట్రాక్టులు ఇప్పించగలరని” ఎద్దేవా చేశారు. “ఆదానీకి కాంట్రాక్ట్ ఇప్పించాలని ఆ శ్రీలంక ప్రభుత్వంలో ఓ నేత చేసిన ఆరోపణలు తప్పని చెప్పగలరా?” అని మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి సవాలు విసిరారు.
ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారిపైకి ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుంటారని, కానీ తప్పు చేయనప్పుడు తాము ఈడీకి, మోడీకి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తెలంగాణలో కోవర్టు రెడ్డిలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారికి ఎంతసేపు తమ కాంట్రాక్టులు, వ్యాపారాలే ముఖ్యం తప్ప రాష్ట్రం, నియోజకవర్గం దానిలో ప్రజల సమస్యలు ముఖ్యం కాదని కేటీఆర్ ఆక్షేపించారు. కోమటిరెడ్డి సోదరుల చిల్లర రాజకీయాలను మునుగోడు ప్రజలకు వివరించాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.