మునుగోడు ఉపఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు పార్టీలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకొంటున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో చండూరులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసుకొన్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మునుగోడులో ప్రచారం కోసం ముద్రించిన కరపత్రాలు, పార్టీ బ్యానర్లు, జెండాలు అన్నీ కాలి బూడిదైపోయాయి. పార్టీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఇది టిఆర్ఎస్ లేదా బిజెపి పనే అయ్యుండవచ్చని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి కూడా ఆ రెండు పార్టీల మీదే అనుమానం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నేను చండూరులో పర్యటనకు వస్తున్నట్లు తెలియగానే మా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మునుగోడులో మా పార్టీకి లభిస్తున్న ఆదరణ చూడలేక ఈ నీచానికి ఒడిగట్టారు. పోలీసులు తక్షణం దర్యాప్తు జరిపి కాంగ్రెస్ కార్యాలయానికి ఎవరు నిప్పు పెట్టారో కనుగొని వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి. లేకుంటే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నేనే ధర్నా చేస్తాను. ఈ వ్యవహారంలో పోలీసులు దోషులను వెనకేసుకువస్తే కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందిస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండాయే. ఇది ఖాయం. టిఆర్ఎస్, బిజెపిలు రెండూ ఒక నాణేనికి బొమ్మబొరుసు వంటివి. కనుక వాటిలో దేనికి ఓటేసినా ఒక్కటే. కనుక మునుగోడు ఓటర్లను విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.