20.jpg)
సిఎం కేసీఆర్ మొన్న విజయదశమినాడు టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజలు కూడా చర్చించుకొంటున్నారు. కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ఏపీలో పలు నగరాలలో ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టారు.
బిఆర్ఎస్ ముందుగా ఏపీలోకే ప్రవేశించవచ్చని అందరూ ఊహించారు కానీ ముందుగా కర్ణాటక, మహారాష్ట్రాలలో పోటీ చేస్తామని సిఎం కేసీఆర్ చెప్పడంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన చేసినందుకు ఏపీ ప్రజలు నేటికీ కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నప్పటికీ, ఈ 8 ఏళ్ళలో ఆయన తెలంగాణను అభివృద్ధి చేసిన తీరు చూసి ఫిదా అయిపోయారు. కనుక రాష్ట్ర విభజన వివాదాలపై కేసీఆర్ ఏపీ ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోగలిగితే బిఆర్ఎస్‌కు ఏపీలో మంచి ప్రజాధారణ లభించే అవకాశం ఉంది.
అయితే బిఆర్ఎస్ లక్ష్యం ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవడం కాదని, లోక్‌సభలో మెజార్టీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడమే అని మంత్రి కేటీఆర్ నిన్న చెప్పారు. మోడీ ప్రభుత్వం వలన తెలంగాణకు మాత్రమే కాక యావత్ దేశానికి తీరని నష్టం జరుగోతోందని కనుక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకతప్పదని అన్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం తమపైకి సీబీఐ, ఈడీ, ఐటిలను ఉసిగొల్పవచ్చని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్-మోడీల మద్య మొదలైన ఈ యుద్ధంలో ఎవరు నెగ్గుతారనే విషయం భవిష్యత్‌లో అందరూ చూస్తారు. అయితే ఈ యుద్ధం కోసం కేసీఆర్ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కేటీఆర్ తాజా ప్రకటనతో స్పష్టమైంది. బిఆర్ఎస్ కేవలం లోక్‌సభ ఎన్నికలకే పరిమితమైతే, ఇతర రాష్ట్రాలలో మిత్రపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు తప్పక సహకరిస్తాయి. వాటితో పొత్తులు పెట్టుకొని బిఆర్ఎస్ 30-40 లోక్‌సభ సీట్లు సాధించగలిగితే, మిగిలిన పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి వీలుకలుగుతుంది. అదే... బిఆర్ఎస్ మొదటే ఇతర రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దపడితే ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బిఆర్ఎస్‌ను గట్టిగా అడ్డుకొంటాయి. అప్పుడు కేసీఆర్ లక్ష్యం నెరవేరదు. కనుక బిఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే పరిమితం అవ్వాలనుకోవడం చాలా తెలివైన నిర్ణయమే అని చెప్పవచ్చు.