ఉపఎన్నికల ప్రచారానికి మేమూ రెడీ: జీవితా రాజశేఖర్

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలలో రాణించలేనివారిలో జీవితా రాజశేఖర్ దంపతులు కూడా ఒకరు. వారు ప్రతీ ఎన్నికలకీ ముందు పార్టీలు మారినా దేనిలోనూ వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదు. ప్రస్తుతం బిజెపిలో ఉన్నవారిద్దరూ మునుగోడు ఉపఎన్నికలలో ప్రచారానికి బయలుదేరబోతున్నారు. హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తమను మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి తరపున ప్రచారం చేయవలసిందిగా కోరగా తాము తప్పకుండా వస్తామని ఆయనకు మాట ఇచ్చామని జీవిత తెలిపారు. త్వరలోనే ఈటల రాజేందర్‌ భార్య జమునతో కలిసి మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని జీవిత తెలిపారు. జీవితకు మంచి మాటకారితనం ఉంది కనుక ఈ ఉపఎన్నికలలో ఆమె బిజెపి అగ్రనేతలను మెప్పించగలిగితే శాసనసభ ఎన్నికలలో ఆమెకు అవకాశం లభించవచ్చు. ఇక పార్టీలో, రాజకీయాలలో ఆమె కంటే చాలా సీనియర్ అయిన విజయశాంతికి ఆహ్వానం అందిందో లేదో తెలియదు కానీ ఇంతవరకు ఆమె మునుగోడు ఉపఎన్నికల గురించి మాట్లాడలేదు.