దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో బాంబు దాడులతో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నుతున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ముసారాంబాగ్‌లో నివాసముంటున్న మహ్మద్ అబ్దుల్ జాహెద్, హుమాయూన్ నగర్, రాయల్ కాలనీలో నివాసముంటున్న మాజ్ హాసన్ ఫరూఖ్, సైదాబాద్‌లో ఉంటున్న అక్బర్ బేగ్‌లను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, రూ.5.41 లక్షల నగదు, సెల్ ఫోన్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకొన్నారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణలో వారు ముగ్గురూ దసరా రోజున హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాలలో ప్రేలుళ్ళు జరపడానికి కుట్ర పన్నినట్లు తెలిసింది. కొంతమంది బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలను హత్య చేసేందుకు కూడా వారు కుట్ర పన్నినట్లు తెలిసింది. పోలీసులు వారిపై సెక్షన్స్ 18, 18(బి), 20ల కింద కేసులు నమోదు చేసి నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.
వారిలో మహ్మద్ అబ్దుల్ జాహెద్ గతంలో బిజెపి నేత ఇంద్రసేనారెడ్డిని 2004లో హత్య చేసేందుకు కుట్రపన్నాడు. ఆ తర్వాత ప్రేలుడు పదార్ధాలు దాచి ఉంచినందుకు అరెస్ట్ అయ్యాడు. కానీ రెండు కేసులలో బెయిల్‌పై బయటకువచ్చాడు. 2005, అక్టోబర్ 12వ తేదీన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన దాడిలో అరెస్ట్ అయ్యి 2017వరకు జైలులోనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మరో విధ్వంసానికి సన్నాహాలు చేసుకొంటుండగా మళ్ళీ పట్టుబడ్డాడు.
హైదరాబాద్ నగరానికే చెందిన మహ్మద్ సమీయుద్దీన్, అబ్దుల్లా బాసిత్, మాజ్ హుస్సేన్ ఫారూఖ్ అనే ముగ్గురు యువకులు 2015లో సిరియాకు వెళ్ళేందుకు నాగపూర్‌లో విమానం ఎక్కబోతుండగా అరెస్ట్ అయ్యారు. వారిలో మాజ్ హుస్సేన్ ఫారూఖ్ ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రేలుళ్ళకు మహ్మద్ అబ్దుల్ జాహెద్ సహకరించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణలో కనుగొన్నారు. వీరందరూ లక్ష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ సూచనల మేరకు ఈ విధ్వంసం, హత్యలకు కుట్రలు పన్నుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఈ తాజా అరెస్టులు వాటిలో బయటపడిన ఈ సంచలన విషయాలను బట్టి నేటికీ భారత్‌లో ఉగ్రవాదుల సానుభూతిపరులు విధ్వంసం సృష్టిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని స్పష్టం అవుతోంది. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రజలు, పోలీసులు కూడా మరింత అప్రమత్తంగా మెలగక తప్పదు.