ముస్లింల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడినందుకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తరపున ఆయన భార్య టి.ఉషాభాయి బిజెపి పెద్దలకు లేఖ వ్రాశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసి తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఆమె తన సోదరిలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిశారు.
తన భర్త రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు కక్షపూరితంగా అక్రమకేసులు బనాయించి పీడీ చట్టం కీద అరెస్ట్ చేయించిందని ఆమె ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన భర్తపై అనేక అక్రమకేసులు బనాయించగా ప్రజాప్రతిధుల కోర్టు వాటిలో చాలా వాటిని కొట్టేసిందని, కొన్ని తుది దశ విచారణలో ఉన్నాయని ఆమె గవర్నర్‌కు తెలిపారు. కనుక గవర్నర్ జోక్యం చేసుకొని తన భర్తను జైలు నుంచి విడుదల చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా ఆమె గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిజెపి నేతలాగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ రాజాసింగ్ కేసు విషయంలో ఆమె జోక్యం చేసుకొన్నట్లయితే, టిఆర్ఎస్ ఆరోపణలను ధృవీకరించినట్లవుతుంది. కనుక ఆమె జోక్యం చేసుకోకపోవచ్చు. రాజాసింగ్ భార్య ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోక తప్పదు.