కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత బేగంపేటలోని హోటల్‌లో హరిత ప్లాజాలో రాష్ట్ర బిజెపి నేతలతో సమావేశానికి బయలుదేరారు. ఆయన కాన్వాయ్ హోటల్ వద్దకు చేరుకొనే సరికి అక్కడ గేటుకి అడ్డంగా ఓ కారు ఉంది. దానిలో టిఆర్ఎస్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు. అమిత్ షా సెక్యూరిటీ సిబ్బంది ఆ కారును పక్కకు తీయాలని చెప్పగా శ్రీనివాస్ కారు తీయలేకపోయాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది అతని కారు అద్దాలు పగులగొట్టి కారును పక్కకి తోసి అమిత్ షా కాన్వాయ్‌కి దారి కల్పించారు. దీనికి సుమారు పది నిమిషాలు పట్టింది. అంతవరకు అమిత్ షా కాన్వాయ్ రోడ్డుపైనే నిలిచిపోయింది. అమిత్ షా హోటల్‌లోకి వెళ్ళిన తర్వాత పంజగుట్ట పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దానిలో ఏవైనా అనుమానాస్పద సందేశాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి వీవీఐపీలు వస్తున్నప్పుడు పది నిమిషాల ముందే పోలీసులు ట్రాఫిక్ నిలిపివేసి వారి కాన్వాయ్‌కి దారి కల్పిస్తుంటారు. అమిత్ షా పర్యటన ముందే ఖరారు అయినందున హోటల్‌లోకి కూడా ఇతరులు ఎవరినీ అనుమతించడం లేదు. కానీ టిఆర్ఎస్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ ఆ సమయంలో అక్కడకి ఎందుకు వచ్చారు?టిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది కనుక కావాలనే దారికి అడ్డంగా కారు పెట్టారా లేదా నిజంగా చెడిపోయిందా?అనే కోణంలో ఇంటలిజన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనను భద్రతావైఫల్యంగానే కేంద్ర హోంశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య మరో సరికొత్త యుద్ధానికి బీజం పడవచ్చు.