తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై రోజురోజుకీ యుద్ధం తీవ్రం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించి, కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని సవాలు చేశారు. ఇప్పుడు మరో సవాలు విసురుతున్నారు. “రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ వారం రోజులలోపుగా జీవో చేస్తాము. దాని ఆమోదం కోసం కేంద్రానికి పంపుతాము. మోడీజీ దానిని ఆమోదిస్తారా లేదా ఉరేసుకొంటారా?” అని కేసీఆర్ సవాల్ విసిరారు.
నేడు ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ, “ఇదివరకు సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు 5-6 శాతం రిజర్వేషన్లు ఉండేవి. దానిని 10 శాతానికి పెంచాలని మేము నిర్ణయించుకొన్నాము. త్వరలోనే దీనికి సంబందించి జీవో విడుదల చేస్తాం. దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే వెంటనే అమలుచేస్తాం. ఏడేళ్ళ క్రితం అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపించాము కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. కనుక ఇప్పుడు ఏకంగా జీవో జారీ చేయబోతున్నాం. దానిని మోడీజీ ఆమోదిస్తారో లేదా ఉరివేసుకొంటారో ఆయన ఇష్టం. సంపదను సృష్టించి దానిని పేదలకు పంచడమే మా ప్రభుత్వ విధానం. రాష్ట్రంలో భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు అమలుచేస్తాం. త్వరలోనే గిరిజన బాలబాలికల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేస్తాం. సమాజంలో అందరికీ సమానావకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం,” అని అన్నారు.