నేటికీ కొంతమంది రజాకార్లకు భయపడుతున్నారు!

ఈరోజు సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగిస్తూ, “ఆనాడు హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజలు పడుతున్న బాధలు చూసి సర్దార్ వల్లభ్ బాయ్‌ పటేల్ సైన్యాన్ని పంపించి నిజాం నవాబు లొంగదీసుకొని  హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేశారు. నిజాం నవాబు హయాంలో రజాకార్లు చేసిన అకృత్యాలను ఎన్నటికీ మరువలేము. నేటికీ కొంతమంది(కేసీఆర్‌)కి రజాకార్లు అంటే లోలోన భయం ఉంది. అందుకే ఇన్నేళ్ళుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడానికి కూడా భయపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తుండటంతో ఇప్పుడు వేరే పేరు పెట్టుకొని తెలంగాణ విమోచన దినోత్సవం చేయకతప్పడం లేదు.

రజాకార్లకు ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా వారి చేతిని విడిచిపెట్టి రావాలని కోరుతున్నాను. రజాకార్లను ఎదిరించే ప్రయత్నంలో ఎన్నోవేల మంది ధనమానప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారి త్యాగాల వల్లనే నేడు మీరు (కేసీఆర్‌) అధికారంలో ఉన్నారని గుర్తుంచుకొని ఏటా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం ద్వారా వారికి నివాళులు అర్పించాలని కోరుతున్నాను. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్రమోడీకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను,” అని అన్నారు.