సిఎం కేసీఆర్ వచ్చే నెల విజయవాడలో పర్యటించనున్నారు. టిఆర్ఎస్, వామపక్షాల మద్య పొత్తులు కుదిరినందున అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వరకు విజయవాడలో జరిగే సిపీఐ జాతీయ మహాసభలలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. సిఎం కేసీఆర్ వీలును బట్టి ఈ ఐదు రోజులలో ఏదో ఒకరోజు విజయవాడలో జరిగే తమ జాతీయ మహాసభలలో పాల్గొంటారని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సీపీఐ తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి కూడా సిఎం కేసీఆర్ విజయవాడ సభలకు హాజరవుతారని తెలిపారు.
ఈ మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సీపీఐ నేతలు హాజరవుతారు. సీపీఐ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కనుక ఈ మహాసభలకు హాజరుకావడం ద్వారా ఆ పార్టీకి కేసీఆర్ మరింత దగ్గర కావచ్చు. ఇదే వేదికపై నుంచి సీపీఐ నేతలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని, బిజెపిని ఎండగట్టవచ్చు కూడా. కనుక జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి సిద్దపడుతున్న సిఎం కేసీఆర్ ఈ మహాసభలకు హాజరవుతుండటం చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు.