
ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు నిరాకరిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి తదితరులు అధికారికంగా నిర్వాహిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించకతప్పడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగా అంటే నేటి నుంచే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యత వజ్రోత్సవాల పేరుతో అట్టహాసంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతోంది.
మరోపక్క రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను చాలా అట్టహాసంగా నిర్వహిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కనుక రేపు హైదరాబాద్ నగరంలో ఒ పక్క సమైక్య వేడుకలు, మరోపక్క విమోచన దినోత్సవ వేడుకలు జరుగబోతున్నాయి.
వీటిని విజయవంతం చేసేందుకు టిఆర్ఎస్, బిజెపి, మజ్లీస్ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తాయి కనుక రేపు నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. నగర పోలీసులకు రేపు నిజంగా అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్షణ, హోంశాఖల మంత్రులు నగరంలో ఉన్నప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వారు సమాధానం చెప్పుకోవలసి వస్తుంది.