సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు జరుగబోయే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొన్నారు. ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్ళి ఆయన భార్య శ్యామలాదేవిని, వారి కుమార్తెలను, అక్కడే ఉన్న ప్రభాస్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబందాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
ఈరోజు రాత్రి పది గంటలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ రానున్నారు. రేపు తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలలో పాల్గొన్న తర్వాత ఆయన కూడా కృష్ణంరాజు కుటుంబాన్ని, ప్రభాస్‌ను పరామర్శించనున్నారు.
ఇదివరకు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూ.ఎన్టీఆర్‌తో భేటీ అవడంపై రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం చెలరేగింది. ఈసారి ఇద్దరు కేంద్రమంత్రులు ప్రభాస్‌ను కలుస్తున్నారు. కనుక దీనిపై కూడా మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రమంత్రులిద్దరూ కేవలం కృష్ణంరాజు మృతికి సంతాపం తెలపడానికే ప్రభాస్‌ను కలుస్తున్నారా లేక ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది కనుక వచ్చే ఎన్నికలలో బిజెపి తరపున ప్రచారం చేయాలని కోరుతారో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు కనుక ప్రభాస్‌కు సంతాపం తెలిపి వెళ్లిపోవచ్చు. కానీ ఈ పరిచయంతో భవిష్యత్‌లో మళ్ళీ కలిసి మద్దతు కోరినా కోరవచ్చు. కానీ ఎప్పుడూ రాజకీయలకు దూరంగా ఉండే ప్రభాస్ అందుకు అంగీకరించకపోవచ్చు.