పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పార్టీలో చాలామంది సీనియర్లు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ను నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని బయటి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ఓ కారణమైతే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా వారి వ్యతిరేకతకు మరో కారణం. మళ్ళీ ఇప్పుడు అదే జరిగింది.
“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ జెండాతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన జెండాను రూపొందిస్తాము. ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాము. రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విదంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాము. టిఆర్ఎస్ ప్రభుత్వం తమ టిఆర్ఎస్ పార్టీని సూచించేవిదంగా రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబరులో ‘టిఎస్’ అని పెట్టించింది. మేము అధికారంలోకి వస్తే దానిని ‘టిజి’ గా మార్చుతామని” రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారుచేయించారు కూడా. రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకొన్నారు. కానీ పార్టీలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారని సీనియర్లు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు.
గురువారం గాంధీ భవన్‌లో ఇదే అంశంపై చర్చ జరిగినప్పుడు కొంతమంది రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ మాట్లాడగా మిగిలినవారు తీవ్రంగా వ్యతిరేకించారు. మళ్ళీ ఈరోజు సమావేశమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు వాదోపవాదాలు చేసుకొన్నారు. మునుగోడు ఉపఎన్నికలకు ముందు పార్టీలో ఇటువంటి గొడవలు జరగడం మంచిది కాదు కనుక రేవంత్ రెడ్డి రేపు జాతీయ జెండాను ఎగురవేయడంతో సరిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.