
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందాలు నేడు మళ్ళీ హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, నెల్లూరులో సోదాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 25 బృందాలు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈడీ బృందాలు హైదరాబాద్‌లో రెండుసార్లు సోదాలు నిర్వహించాయి. ఇది మూడోసారి. ఇవాళ్ళ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో సోదాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నందున ఈడీ అధికారులు దీనికి సంబందించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడుతున్న రామచంద్ర పిళ్ళై నివాసంలో నానక్‌రాంగూడలోని ఆయనకి చెందిన రాబిన్ డిస్టలరీస్ కార్యాలయంలో ఇదివరకు సోదాలు నిర్వహించారు. రాబిన్ డిస్టలరీస్, రాబిన్ ఎల్ఎల్‌పీ పేరుతో గల రెండు కంపెనీలలో అభిషేక్ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్ సాగర్ రావు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
వారు సిఎం కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాయంతో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మద్యం పాలసీని తమకు అనుకూలంగా రూపొందించారని ఢిల్లీకి చెందిన ఇద్దరు బిజెపి నేతలు చేసిన ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇందుకుగాను వారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, కల్వకుంట్ల కవితకు భారీగా డబ్బు ముట్టజెప్పారని, వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలలోనే కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కుటుంబానికి చెడిన మరికొందరు కలిసి ఢిల్లీ వెళ్ళేవారని, అక్కడ స్టార్ హోటల్‌లో వారికి రూములు కూడా రామచంద్ర పిళ్ళై బృందమే ఏర్పాటు చేసిందని వారు ఆరోపించారు. అయితే ఈ కేసులో కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందని కానీ లేదని కానీ ఈడీ అధికారులు ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎటువంటి సంబందం లేదని కల్వకుంట్ల కవిత వెంటనే ఖండించారు కూడా. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు తన తండ్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక మద్యలో తనను ఈ కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ, సోదాలతో ఈడీ పని పూర్తికాదు. కనుక ఏదో రోజున వారు ఆమె ఇంటి వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు.