రేపు కరెన్సీ నోట్లపై మోడీ ఫోటో ముద్రిస్తారేమో?

గత కొంతకాలంగా తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దానిలో భాగంగా సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు కూడా ప్రధాని నరేంద్రమోడీని, ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్‌ కూడా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పనితీరుపై తనదైన శైలిలో సునిశిత విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా కేటీఆర్‌ పోస్ట్ చేసిన ఓ సందేశానికి భారీగా స్పందన వస్తోంది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీజి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. నగరంలోని సరదార్ వల్లబ్ భాయ్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చారు. బహుశః త్వరలోనే కరెన్సీ నోట్లపై కూడా మహాత్మా గాంధీజీ బొమ్మ స్థానంలో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టాలని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదన చేస్తారేమో?” అని ట్వీట్ చేశారు. 

దేశంలో బిజెపి ఒక్కటే అధికారంలో ఉండాలనేది తమ లక్ష్యం అని బిజెపి నేతలే చెపుతున్నారు. కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో మళ్ళీ బిజెపి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తే, దేశంలోని బిజెపియేతర ప్రభుత్వాలను కూడా కూలద్రోసి దేశమంతా బిజెపి ఏలుబడిలోకి వస్తే అప్పుడు ప్రశ్నించేవారే ఉండరు కనుక తప్పకుండా కరెన్సీ నోట్లపై నరేంద్ర మోడీ బొమ్మను ముద్రించినా ఆశ్చర్యం లేదు.