
ఈసారి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపబోతున్న సంగతి తెలిసిందే. దానికి ముఖ్య అతిధిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఆయన ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం హైదరాబాద్ చేరుకొనున్నారు. ఆయన హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది.
అమిత్ షా శుక్రవారం రాత్రి 9.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీకి వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారు. మర్నాడు ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బేగంపేటలోని టూరిజం ప్లాజాకు చేరుకొని అక్కడ రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలతో సమావేశమయ్యి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నికల గురించి చర్చిస్తారు.
శనివారం ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్వర్యంలో మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో వేడుకలు జరుగబోతున్నాయి. అమిత్ షా దానిలో పాల్గొని వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం మళ్ళీ పోలీస్ అకాడమీ చేరుకొని అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
ఓ పక్క కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుపబోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున సమైక్యదినంగా వేడుకలు జరుపబోతోంది. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగవైభవంగా ఈ ఉత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతకాలం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోటీగా మూడు రోజుల పాటు నిర్వాహిస్తుండటం విశేషమే కదా?