
కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఈసారి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నాటి రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ యోధులు చేసిన సాయుధపోరాటాలు, వారి బలిదానాలను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
దాని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, అకృత్యాలు ఎన్నటికీ మరిచిపోలేము. వారిని ఎదుర్కొనేందుకు మన తెలంగాణ వీరులు సాయుధపోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారు. బైరాన్ పల్లిలో 90 మందిని రజాకార్లు తుపాకీలతో కాల్చి చంపారని తెలుసుకొన్నప్పుడు నేను చాలా బాధ పడ్డాను. తెలంగాణ కోసం ఆనాడు వారు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరిచిపోలేము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం నవాబు తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిరాకరిస్తే భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపి నిజాం పాలనలో ఉన్న తెలంగాణకు సెప్టెంబర్ 17న విమోచనం కల్పించింది. కనుక తెలంగాణ ప్రజలందరూ వారి త్యాగాలను స్మరిస్తూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.
రాష్ట్ర బిజెపి అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని నిర్ణయించడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. కానీ ఆ రోజున విమోచన దినోత్సవంగా కాక జాతీయ సమైక్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. కానీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలని పిలుపునీయడం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వంతో మరో యుద్ధాన్ని ఆహ్వానించినట్లయింది. టిఆర్ఎస్ నేతలు దీనిపై వెంటనే స్పందించకుండా ఉండరు.