ఎవడ్రా నీకు మరదలు? వైఎస్ షర్మిల

ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల, టిఆర్ఎస్‌ నేతలు తనపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడంపై స్పందించారు. “మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. కానీ నన్ను ‘మంగళవారం మరదలు’ అని ఎగతాళిగా సంభోదిస్తే నేను ఎవడ్రా నీకు మరదలు?అని నిలదీసి అడిగాను. ఆయన మరదలు అని పిలవగానే ఆయన వెనక వెళ్ళాలా లేక చూసి చూడనట్లు మౌనం వహించాలా?ఇంకొకరైతే అలా పిలిచినందుకు చెప్పుతో కొట్టేవారు. పరాయి స్త్రీని ఉద్దేశ్యించి ఆయన ఆవిదంగా మాట్లాడవచ్చా?నాకు ఆత్మగౌరవం ఉండదని అనుకొంటున్నారా?

వాళ్ళు ఈవిదంగా నన్ను అవహేళన చేస్తూ మాట్లాడవచ్చు. కానీ నేను ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా?నేను ప్రజల మద్యన తిరుగుతూ వారు నాతో చెప్పినవాటినే నేను మీడియా ద్వారా చెపుతున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ ఉద్యోగాలు పోతాయనో, సంక్షేమ పధకాలు, పింఛన్లు నిలిపివేస్తుందనే భయంతో ప్రజలు తమ మనసులో మాటలను బయటకి చెప్పడానికి భయపడుతున్నారు. జర్నలిస్టులు, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడుతున్నారు. 

కనుకనే నేను మాట్లాడవలసివస్తోంది. నేను ప్రజాభిప్రాయాన్నే వ్యక్తపరుస్తున్నాను. కేసీఆర్‌ ప్రభుత్వం విధానాలనే నేను ప్రశ్నిస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదు. కనుక నా ఆరోపణలు నిరూపించుకోవడానికి నా వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. స్పీకర్‌  పోచారం శ్రీనివాస్ రెడ్డి నాపై ఎటువంటి చర్యలు తీసుకోరనే నేను భావిస్తున్నాను. ఒకవేళ తీసుకొంటే న్యాయపోరాటం చేస్తాను. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నా పాదయాత్రను నిలిపివేస్తే నేను మరో విదంగా ప్రజల వద్దకు వెళతాను తప్ప నా పోరాటం నిలిపివేయను,” అని అన్నారు.