
హైదరాబాద్‌లోని
టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త! 24 గంటలపాటు హైదరాబాద్ నగరంలో తిరిగేందుకు
టి-24 పేరుతో జారీ చేస్తున్న డైలీ పాసు ధరను రూ.20 తగ్గిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ
ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం
ఈ టి24 పాసు ధర రూ.120 ఉండగా మంగళవారం నుంచి రూ.100కె లభిస్తోంది. ప్రతీరోజు పలు బస్సులు
మారి ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్ళేవారికి, ముఖ్యంగా హైదరాబాద్ చూసేందుకు
వచ్చే సందర్శకులకి ఈ డైలీ పాసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టి24 పాసుతో జంటనగరాలలో
అన్ని సిటీ బస్సులలో తిరగవచ్చు.
ఇదే కాదు.. ఈ నెల 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు గరుడ ఏసీ బస్సు ఛార్జీలు తగ్గించి రాజధాని బస్సులతో సమానం చేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. టీఎస్‌ఆర్టీసీకి ఎండీగా వీసి సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దానిని నష్టాల ఊబిలో నుంచి బయటపడేసి లాభాలు ఆర్జించలేకపోయినా దాని నిర్వహణ ఖర్చులు అది సంపాదించుకొనేలా చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. వాటిలో భాగంగానే టీఎస్‌ఆర్టీసీ ఇటువంటి ఆఫర్లు ప్రకటిస్తోంది.