మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరిరోజున వివిద సంఘాలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ పే స్కేలు పెంచుతామంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ ఇతవరకు నెరవేర్చనందుకు నిరసనగా వందలాదిమంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. వారితో పాటు ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు, కాంగ్రెస్ మత్స్యకార విభాగం నేతలు అసెంబ్లీ వద్ద మెరుపు ధర్నాకు సిద్దమయ్యారు.
దీంతో పోలీసులు వీఆర్ఏలను అసెంబ్లీ వరకు చేరుకోకుండా మద్యలోనే అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా వారిపై స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.2,000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారని, కనుక ఇకనైనా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రెడ్డి సంఘల నేతలు అసెంబ్లీ వద్ద ధర్నాకు సిద్దపడ్డారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ పార్టీలోని ఫిషరీస్ విభాగం ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మత్స్యకారులను కాదని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కాంట్రాక్టర్లకు చేపల టెండర్లను అప్పగిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కనుక చేపల టెండర్లలో తెలంగాణ మత్స్యకారులకే ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నాకు సిద్దమయ్యారు. ఒకేసారి ఇంతమంది అసెంబ్లీ ముట్టడి, ధర్నాలకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకొని తరలించేందుకు చాలా శ్రమ పడాల్సి వచ్చింది.
వీఆర్ఏల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ, వారి తరపున 10 మందిని చర్చలకు ఆహ్వానించి అసెంబ్లీ ఆవరణలోనే వారితో సమావేశమయ్యి ఈ నెల 18వ తేదీ వరకు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆరోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారితో సమావేశమయ్యి వారి డిమాండ్స్‌పై చర్చిస్తారని చెప్పడంతో వీఆర్ఏలు చాలా సంతోషం వ్యక్తం చేసి, ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించారు.