
నేటితో ముచ్చటగా మూడు రోజుల శాసనసభ సమావేశాలు ముగిసిపోతాయి. ఈరోజు శాసనసభకు హాజరైన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ నెల 6వ తేదీన జరిగిన తొలిరోజు సమావేశానికి ఆయన హాజరుకాలేదు కానీ బీఏసీ సమావేశానికి బిజెపి సభ్యులను ఆహ్వానించకపోవడంపై ఓ సభలో మాట్లాడుతూ, “స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కనుసన్నలలో పనిచేసే ఓ మరమనిషి వంటివారు,” అని విమర్శించారు. తనను సస్పెండ్ చేయబోతున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, “వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌నే సభలోకి అడుగు పెట్టకుండా చేస్తాను,” అని అన్నారు.
సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈటల రాజేందర్ ఆయనకు క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దాస్యం వినయ్ భాస్కర్ శాసనసభలో పట్టుబట్టారు. కానీ అందుకు ఈటల రాజేందర్ అంగీకరించకపోవడంతో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని ఈటల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయనకు, టిఆర్ఎస్ సభ్యులకు మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, సభా మర్యాదలు నిలిపేందుకు ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పోలీసులు ఆయనను వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, “నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి నన్ను శాసనసభలోకి రాకుండా అడ్డుకొంటూ నా గొంతు నొక్కుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు నేను విశ్రమించను. పోలీసులు కూడా కేసీఆర్‌కు బానిసలలా వ్యవహరిస్తున్నారు. అందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది,” అని అన్నారు.