3.jpg)
ఈరోజు శాసనసభ సమావేశంలో సుదీర్గంగా ప్రసంగించిన సిఎం కేసీఆర్ మరోసారి మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మోడీ ప్రభుత్వం ఎల్ఐసీ, రైల్వే, విమానాయన సంస్థలతో సహా అన్నిటినీ వరుసగా అమ్మేస్తూ కార్పొరేట్ కంపెనీల చేతికి అప్పగించేస్తోంది. ఇప్పుడు దాని దృష్టి వ్యవసాయం, భూములపై పడింది. అందుకే సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. మన ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు వంటివి అందిస్తుండటం వలన ఇప్పుడిప్పుడే వారు చెయ్యి జాపకుండా పంటలు పండించగలుగుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు చేస్తే రాష్ట్రంలో రైతులు వారి పొలాలలోనే వారు కూలీలుగా మారే ప్రమాదం ఉంది.
జెండాలు, టపాసులతో సహా చాలా వరకు చైనా నుంచే దిగుమతి చేసుకొంటున్నప్పుడు మేకిన్ ఇండియా అని చెప్పుకోవడం సిగ్గుచేటు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే. సౌర విద్యుత్ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేసేందుకు మోడీ ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తోంది. చివరికి టీఎస్‌ఆర్టీసీని కూడా అమ్మేయాలని లేఖల మీద లేఖలు వ్రాస్తోంది.
ఏపీకి మనం వడ్డీతో కలిపి రూ.6,000 కోట్లు నెలరోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం హుకుంజారీ చేసింది. కానీ ఏపీ మనకు ఇవ్వాల్సిన రూ.17,000 కోట్లు గురించి కేంద్ర మంత్రులకి, సదరన్ రీజినల్ బోర్డుకి ఎన్ని లేఖలు వ్రాసిన స్పందించలేదు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయకుండా, అప్పులు లభించకుండా అడ్డుకొంటూ మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.
సింగరేణిలో టన్ను రూ.4,000కే బొగ్గు దొరుకుతుంటే అది వద్దని రూ.30,000 చొప్పున విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది... ఎందుకు?సింగరేణిని కూడా అమ్మేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వానికి ఇంత కక్ష దేనికో నాకు అర్దం కాదు.
సంస్కరణల పేరుతో సామాన్య ప్రజలు, రైతులపై పెను భారం మోపాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికలలో పోటీ చేసి నేరుగా గెలవలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ప్రభుత్వాలను కూల్చేసి దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకొంటోంది.
ప్రధాని నరేంద్రమోడీకి దూరదృష్టి లేకపోవడం వలన దేశంలో అన్ని వ్యవస్థలు ఒకటొకటిగా నిర్వీర్యం అవుతున్నాయి. కనుక దేశాన్ని కాపాడుకోవడం కోసం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకతప్పదు,” అని అన్నారు.