
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు సిఎం కేసీఆర్ ఈరోజు శుభవార్త చెప్పారు. ఈరోజు శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ, “ఈ ఉద్యోగాలకు ప్రిలిమనరీ పరీక్షల కటాఫ్ మార్కుల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కనుక ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం,” అని సిఎం కేసీఆర్ చెప్పారు.
ఓసీ అభ్యర్ధులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కటాఫ్ మార్కులుగా పోలీస్ బోర్డు నిర్ణయించింది. అయితే ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ప్రకటించడంతో వారి కటాఫ్ మార్కులు 30 శాతం అయ్యాయి. అప్పుడు అన్ని కేటగిరీలకు సమానమైంది.
ఓసీ, బీసీలకు 10, 5 శాతం సడలింపు ఇచ్చి, ఎస్సీ, ఎస్టీలకు సడలింపు ఇవ్వకపోవడంతో ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు చేపట్టారు. వారి అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ప్రిలిమ్స్ పరీక్షలలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పారు.
దీంతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు అంత కంటే తక్కువ మార్కులు వచ్చినా మెయిన్స్ వ్రాసే అవకాశం లభిస్తుంది. అయితే కటాఫ్ మార్కులు ఎంతని నిర్ణయించారో చెప్పలేదు కానీ బహుశః 25శాతం ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడవచ్చు.