
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ఈ నెల 25 నుంచి ప్రారంభం అవుతుంది. కనుక ఈ ఏడాది కూడా ప్రభుత్వం రాష్ట్రంలో పేదమహిళల కోసం బతుకమ్మ చీరలు తయారుచేయించింది. ఈ ఏడాది మొత్తం ఒక కోటి 18 లక్షల చీరలను తయారు చేయించింది. సిరిసిల్లా, పోచంపల్లి, గద్వాల్ జిల్లాలకు చెందిన నేతన్నలు ముప్పై రంగులు, 240కి పైగా డిజైన్లు, 800 కలర్ కాంబినేషన్లో వీటిని తయారుచేశారు. ఈసారి చీరలకి వెండి, బంగారు, జారీ అంచులతో మహిళలను ఆకట్టుకొనేలా తయారుచేశారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.340 కోట్లు ఖర్చు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పధకాలలో ఇదీ ఒకటని చెప్పవచ్చు. వీటిని నేసేపని నేతన్నలకు అప్పగించడం ద్వారా నేతన్నలకు చేతినిండా పని, ఆదాయం సమకూర్చుతోంది. మరోపక్క రాష్ట్రంలో నిరుపేద మహిళలకు ఈ చీరలు అందించి తెలంగాణలో అత్యంత ముఖ్యమైన బతుకమ్మ పండుగనాడు వారు కొత్త చీర కట్టుకొని ఆనందంగా పండుగ చేసుకొనేందుకు తోడ్పడుతోంది. ఈ వారంలోనే వాటిని జిల్లాలలో రేషన్ దుకాణాలకు తరలించి మహిళలకు అందించేందుకు టెస్కో, తెలంగాణ చేనేత విభాగం ఏర్పాట్లు చేస్తున్నాయి.