
ఒకప్పుడు శాసనసభ సమావేశాలు కనీసం మూడు వారాలు సాగేవి... ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలు, బిల్లులపై లోతుగా చర్చించేవారు. కానీ గతే కొన్నేళ్ళుగా శాసనసభ, మండలి సమావేశాలు మొక్కుబడిగా మూడు నాలుగు రోజులు నిర్వహించి ‘మమ’ అనిపించేస్తున్నాయి అన్ని రాష్ట్రాలు.
ఈసారి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా మూడు రోజులే నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వాటిలో మొదటిరోజు సంతాప తీర్మానాలు చేసి ఉభయసభలను వాయిదా వేశారు. మళ్ళీ 5 రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయసభలు సమావేశం కానున్నాయి.
ముందుగా ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావుకి సంతాపం తెలుపుతారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై ఉభయసభలలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ రెండు రోజులలో ప్రభుత్వం ఏడు చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుంది.
వీటిలో తెలంగాణ యూనివర్సిటీ కామన్ బోర్డు ఏర్పాటుకి బిల్లు కూడా ఉంది. దీనిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెడతారు. దీనిద్వారా ఇక నుంచి తెలంగాణ యూనివర్సిటీలలో బోధన, భోదనేతర సిబ్బంది నియామకాలకు ఓ కామన్ బోర్డ్ ఏర్పాటవుతుంది.