ఖమ్మం కమ్మ సంఘం నాయకుడు ఎర్నేని రామారావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు దాడి చేశారని కమ్మ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమ్మ సంఘం ఎన్నికలలో పువ్వాడ వర్గానికి చెందిన ప్యానల్ ఓడిపోవడంతో వారు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పువ్వాడ వర్గానికి చెందినవారుగా చెప్పబడుతున్నవారు కూడా ఎర్నేని రామారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ గొడవలలోకి బిజెపి నేతలు ఎంట్రీ ఇవ్వడంతో, కమ్మ సంఘంలో గొడవలు కాస్తా టిఆర్ఎస్, బిజెపి మద్య పోరుగా మారాయి.
ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎర్నేని రామారావును బిజెపి నేతలు గల్లా సత్యనారాయణ, ఉప్పల శారద, శ్యామ్ రాథోడ్, ఉపేందర్ తదితరులు నిన్న పరామర్శించారు. అనంతరం బిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో టిఆర్ఎస్ గూండాల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎర్నేని రామారావుపై టిఆర్ఎస్ దాడిని హత్యాయత్నంగానే పరిగణించి పోలీసులు తక్షణం టిఆర్ఎస్ గూండాలను అరెస్ట్ చేసి, కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఈవిదంగా భౌతికదాడులు, హత్యారాజకీయాలు చేస్తుండటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం,” అని అన్నారు.