తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి దంపతులు గత ఏడాది ఫిబ్రవరిలో కారులో వెళుతుండగా వారిని కొందరు దుండగులు పెద్దపల్లి జిల్లా మండలంలో కల్వచర్ల వద్ద అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తులు గొడ్డళ్ళతో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేసి పారిపోయారు.
ఆ కేసులో తెలంగాణ సిఐడీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని కనుక సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ వామనరావు తండ్రి కిషన్ రావు ఇదివరకు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కానీ తెలంగాణ సిఐడీ పోలీసులు సమర్పించిన రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం సంతృప్తి వ్యక్తపరిచి, సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది.
కనుక కిషన్ రావు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ హత్యలో కొందరు ప్రముఖుల ప్రమేయం ఉన్నందున తెలంగాణ సిఐడీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని కనుక సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, దీనిపై నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.