సిఎం కేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై ఫైర్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మూడేళ్ళు పదవీకాలం పూర్తయిన సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ తెలంగాణ సిఎం కేసీఆర్‌ వైఖరిపై ఫైర్ అయ్యారు. ఆమె ఏమన్నారో క్లుప్తంగా... 

• కేసీఆర్‌ చెప్పినట్లు వింటే నాకు గౌరవం ఇస్తారు. ప్రోటోకాల్ పాటిస్తారు లేకుంటే నన్ను నా పదవిని గౌరవించరా? 

• మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడేహక్కు సామాన్య ప్రజలకు కూడా ఉంటుంది. కానీ రాష్ట్రానికి ప్రదమ మహిళనైనా నాకు ఉండదా? 

• మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలననే కదా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు లేకుంటే నావద్దకు ఎందుకు వస్తారు?కనుక తప్పు మీలో పెట్టుకొని నేను ప్రజలతో మాట్లాడటం తప్పని మళ్ళీ నన్ను నిందిస్తారెందుకు?అయినా ఓ మహిళని, అందునా రాష్ట్ర గవర్నర్‌నైనా నన్ను నిందించడం ఏం సంస్కారం?  

• నేను ప్రజా సమస్యల పరిష్కారం గురించే ఆలోచిస్తాను తప్ప రాజకీయాలపై నాకు ఆసక్తిలేదు. మీ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించేసి ఉంటే ప్రజలు నవద్దకు ఎందుకు వస్తారు?మద్యలో నేనెందుకు జోక్యం చేసుకొంటాను?

• మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందా?నెరవేర్చకుండానే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రదమ మహిళనైన నేనూ మాట్లాడకూడదా? 

• అన్ని రాష్ట్రాలలో రాజ్ భవన్‌లో జెండా ఎగురవేస్తారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతారు. అది మన జాతీయ పతాకం పట్ల, మన దేశం పట్ల గౌరవం ప్రకటించడమే తప్ప కేవలం గవర్నర్‌ను గౌరవించడం మాత్రమే కాదు. కానీ ఆ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు రారు? ఎవరినీ రానీయరు.. ఎందుకు? 

• గవర్నర్‌ గుమ్మం దాటకూడదు... ఎవరితో మాట్లాడకూడదు... అనుకొంటే కుదర్దు. నేనూ ఈ దేశంలో పౌరురాలినే. నాకు కొన్ని ప్రాధమిక హక్కులు ఉంటాయి. కనుక ప్రజా సమస్యలపై ఓ పౌరురాలిగా నేనూ తప్పక స్పందిస్తాను. 

• అసలు గవర్నర్‌ పదవే వద్దనుకొంటే మళ్ళీ నాకే ఎందుకు ఫైల్స్ పంపిస్తున్నారు?నాకే వినతి పత్రాలు ఎందుకు ఇస్తున్నారు?

• రాజ్యాంగ బద్దమైన ఈ పదవి విలువ ఏమిటో, నా పరిధి, అధికారాలు ఏమిటో నాకు బాగా తెలుసు. వాటికి లోబడే నేనూ నడుచుకొంటున్నాను. 

• ఈ మూడేళ్ళలో తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చాలా పొందాను కానీ కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి చాలా అవమానాలు, అవహేళనలు ఎదుర్కోవలసివస్తోంది, అని ఆవేదన వ్యక్తం చేశారు.