సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ సీనియర్ నేత పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు పోటీ పడటంతో బుదవారం శంషాబాద్‌లో సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించగా కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు మాత్రమే రావడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చాడా వెంకట్ రెడ్డి మళ్ళీ ఆ పదవి తనకే ఇవ్వాలని కోరారు. కానీ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు గట్టిగా పట్టుబట్టారు. ఆయనకు పోటీగా పల్లా వెంకట్ రెడ్డి వచ్చారు. దీంతో ఏకగ్రీవంగా తనను ఎన్నుకొనేమాటయితేనే తాను బరిలో ఉంటానని లేకుంటే తప్పుకొంటానని చెప్పి చాడా వెంకట్ రెడ్డి తప్పుకొన్నారు. బరిలో మిగిలిన ఇద్దరూ వెనక్కు తగ్గకపోవడంతో ఎన్నిక నిర్వహించగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. 

తెలంగాణలో టిఆర్ఎస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని వామపక్షాలు నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మారినందున ఆ నిర్ణయంలో మళ్ళీ ఏమైనా మార్పు ఉంటుందా లేక టిఆర్ఎస్‌తో కలిసి కొనసాగాలనే నిర్ణయానికి కూనంనేని కూడా కట్టుబడి ఉంటారా? అనేది త్వరలోనే తెలుస్తుంది.