సెప్టెంబర్‌ 25న హర్యానాలో సభ... కేసీఆర్‌కు ఆహ్వానం

ఈ నెల 25న హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధ్వర్యంలో ఓ భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా చెప్పారు. ఈ సభకు తెలంగాణ బిహార్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీలతో పాటు టిడిపి, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, శిరోమణి అకాలీదళ్, ఎన్సీపీ అధినేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. మోడీ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని కనుక బిజెపిని గద్దె దించడానికి దేశంలో బిజెపియేతర పార్టీలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అభయ్ చౌతాలా చెప్పారు.     

సిఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీల అధినేతలను స్వయంగా కలిసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసి పనిచేద్దామని కోరారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించలేదు కనుక కేసీఆర్‌ తప్పకుండా హాజరవవచ్చు. 

ఈ వేదిక ద్వారా సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించి, మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టే ప్రయత్నం చేయవచ్చు. జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందు ఈ వేదిక ద్వారా తన ఆలోచనలను ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో పంచుకోగలుగుతారు. అంతకంటే ముఖ్యంగా తన నాయకత్వ లక్షణాలను అందరికీ పరిచయం చేసుకోగలుగుతారు. కనుక ఈ బహిరంగసభకు సిఎం కేసీఆర్‌ తప్పకుండా హాజరవుతారనే భావించవచ్చు.