
బిజెపి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకి పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన భార్య ఉషాభాయి అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన భర్తపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, కానీ పోలీసులు అధికారపార్టీ దాని మిత్రపక్షం ఒత్తిడికి తలొగ్గి తన భర్తపై ఓ పాత కేసులో కనీసం నోటీస్ ఇవ్వకుండా పీడీ యాక్ట్ కింద మళ్ళీ వెంటనే జైలుకి పంపించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని కనుక తక్షణం విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆమె పిటిషన్‌ను నేడు విచారణకు చేపట్టిన హైకోర్టు, ప్రతివాదులుగా పేర్కొన్న రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంటే బెయిల్ దొరక్కపోతే రాజాసింగ్ మరో నెలరోజులు జైల్లో ఉండక తప్పదన్న మాట!