దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తాం: కేసీఆర్‌

నిజామాబాద్‌లో సోమవారం జరిగిన బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ మరోసారి మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. 2024సార్వత్రిక ఎన్నికలలో బిజెపిని ఓడించి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని, ఆ తర్వాత రైతు అనుకూల ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరికీ 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నానని అన్నారు. 

మోడీ ప్రభుత్వం ఓడరేవులు, విమానయాన సంస్థలు, రైల్వే, ప్రభుత్వ రంగా సంస్థలను ఒకటొకటిగా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తోందని, రైతు వ్యతిరేక చట్టాలు, నిర్ణయాలు తీసుకొంటూ చివరికి వ్యవసాయాన్ని కూడా వాటికి కట్టబెట్టేసేందుకు సిద్దం అవుతోందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అమలుచేస్తామంటే, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే, దళిత బందు పధకం ఇస్తామంటే అభ్యంతరం చెపుతోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. 

ఓ పక్క దేశాన్ని అమ్మేస్తూ మరోపక్క అధికార దాహంతో ప్రజాప్రభుత్వాలను కూలగొడుతూ, ప్రజల మద్య మత చిచ్చు రగిలిస్తోందని అన్నారు. కనుక తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని అన్నారు. సింగూరుకు త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయని సిఎం కేసీఆర్‌ తెలియజేశారు.