నేడు నిజామాబాద్‌లో సిఎం కేసీఆర్‌ బహిరంగసభ

సిఎం కేసీఆర్‌ నేడు నిజామాబాద్‌లో బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టిఆర్ఎస్‌ కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించిన తర్వాత సభలో పాల్గొంటారు. 

సిఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 1.15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌ చేరుకొంటారు. అక్కడి నుంచి కారులో ఎల్లమ్మగుట్టకు చేరుకొని టిఆర్ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్ భవనం వద్దకు చేరుకొని దానికి ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. 

సిఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా నిజామాబాద్‌ పట్టణంలో బిజెపి శ్రేణులు నిరసనలు తెలిపే అవకాశం ఉంది గనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.  

ఇటీవల కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఈ సభలో సిఎం కేసీఆర్‌ జవాబు చెప్పనున్నారు. మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య యుద్ధవాతావరణం నెలకొని ఉన్నందున సిఎం కేసీఆర్‌ ఈరోజు సభలో బిజెపి, మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది.