కేసీఆర్‌ నేడు సంచలన నిర్ణయాలు ప్రకటించనున్నారా?

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌ సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం దాని తర్వాత సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ శాసనసభ్యులు, ఎంపీలతో సమావేశం జరుగనున్నాయి. సాధారణంగా సిఎం కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశాలను సుదీర్గంగా నిర్వహిస్తుంటారు. కానీ ఈరోజు మూడు గంటలలోనే ముగించి వెంటనే టిఆర్ఎస్‌ ఎల్పీ సమావే శం నిర్వహిస్తుండటంతో సిఎం కేసీఆర్‌ ఏదో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

మంత్రివర్గ సమావేశంలో ఆసరా పింఛన్లు, పోడు భూముల సమస్య, బతుకమ్మ పండగకు చీరాల పంపిణీ, శాసనసభ సమావేశాల షెడ్యూల్ ఖరారు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. మజ్లీస్‌కు భయపడి సిఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదని బిజెపి పదేపదే ఆరోపిస్తోంది. కనుక దీనిపై కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. భారత్‌కు స్వాతంత్ర్యం  లభించి 75 సం.లు పూర్తయిన సందభంగా ఏడాది పొడవునా తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి ఈ అంశంపై టిఆర్ఎస్‌ను విమర్శించే అవకాశం లేకుండా చేయవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. 

టిఆర్ఎస్‌ ఎల్పీ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికలు, కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడంపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకొన్నందున, టిఆర్ఎస్‌ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయపార్టీగా రిజిస్టర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కనుక ఈరోజు సమావేశాలలో ఈ అంశంపై చర్చించి అందరి ఆమోదంతో సిఎం కేసీఆర్‌ ప్రకటించవచ్చు.  

సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చునని ఊహాగానాలు వినిపిస్తునందున ఈ సమావేశాల తర్వాత దీనిపై కూడా స్పష్టత ఈయవచ్చు.