అట్లయితే ఇతర రాష్ట్రాలలో కేసీఆర్‌ ఫోటో పెట్టాలి

కామారెడ్డిలో బిజెపి సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ్ళ జిల్లాలోని బీర్కూర్‌లోని ఓ రేషన్ దుకాణానికి వెళ్ళి తనికీలు నిర్వహించి అక్కడ ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి పాటిల్‌ని నిలదీశారు. 

ఊహించినట్లే దీనిపై టిఆర్ఎస్‌ మంత్రి హరీష్ రావు నుంచి చాలా ఘాటైన స్పందన వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రధానమంత్రి ఫోటోను రేషన్ షాపులో పెట్టాలని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆవిదంగా చేస్తే ప్రధాని హోదాను దిగజార్చినట్లే అవుతుంది కదా?అయినా తెలంగాణ నుంచి కేంద్రానికి ఏటా రూ.3,65,795 కోట్లు పన్నుల రూపంలో వెళుతుంటే దానిలో సగం కూడా తిరిగి ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్నులతోనే దేశంలో అనేక రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సాకుతోంది. కనుక తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎం కేసీఆర్‌ ఫోటో ఇతర రాష్ట్రాల రేషన్ షాపులలో పెడతారా? కేంద్రమంత్రులు సైతం రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తుండటం చాలా శోచనీయం. అయినా తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు?” అని ప్రశ్నించారు.