కేంద్రమంత్రి రేషన్ షాపు తనికీ... ఓవర్ యాక్షన్ కదా?

తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు రోజురోజుకీ ముదురుతోంది. సిఎం కేసీఆర్‌ మళ్ళీ దేశాటన చేస్తూ కూటమి ఏర్పాటు ప్రయత్నాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, కామారెడ్డిలో బిజెపి సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ్ళ హటాత్తుగా జిల్లాలోని బీర్కూర్‌లోని ఓ రేషన్ దుకాణానికి వెళ్ళి తనికీలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించారు. 

దేశాన్ని నడిపిస్తున్న కేంద్ర ఆర్ధికమంత్రి ఈవిదంగా ఓ రేషన్ దుకాణాన్ని తనికీలు చేయడం చాలా అతిగా అనిపిస్తుంది. అయితే కేసీఆర్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి వ్యూహంలో భాగంగానే ఆమె పర్యటించినట్లు అర్దమవుతోంది. 

ఆమె రేషన్ దుకాణంలో లబ్దిదారులతో మాట్లాడి రేషన్ సరుకులు అన్నీ సకాలంలో అందుతున్నాయా లేదా?అవి నాణ్యంగా ఉంటున్నాయా లేదా? అని అడిగి తెలుసుకొన్నారు. 

ఆ తర్వాత ఆమె జిల్లా కలెక్టర్‌ జితేష్ వి పాటిల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రేషన్ బియ్యంలో ఒక కేజీపై కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత?రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? అని ప్రశ్నించగా కిలో బియ్యం రూ.35 కాగా దానిలో రూ.29 కేంద్రప్రభుత్వమే ఇస్తోందని మిగిలిన రూ.6 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. మరి అటువంటప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం పధకమని ప్రజలకు తెలిసేలా ఇక్కడ ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు? అంటూ గట్టిగా నిలదీశారు.