తెలంగాణ అమర జవానుని మరచి బిహార్‌లో చెక్కులు పంపిణీయా?

సిఎం కేసీఆర్‌ మొన్న బిహార్‌ పర్యటనలో గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు, బోయగూడలోని ఓ ఇనుప స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన బిహార్‌కు చెందిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. 

కాంగ్రెస్‌ సీనియర్ నేత మల్లు రవి దీనిపై స్పందిస్తూ, “నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య 2013లో జమ్మూలో ఉగ్రవాదుల దాడిలో మరణించాడు. అప్పుడు సిఎం కేసీఆర్‌ ఆయన కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన భార్య సుమతికి ప్రభుత్వోద్యోగం, వారి పిల్లల చదువులకు ఆర్ధిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వాటిలో ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలుచేయలేదని యాదయ్య భార్య, పిల్లలు బుదవారం గాంధీ భవన్‌కు వచ్చి మాకు చెప్పారు. భర్త చనిపోయిన తర్వాత పిల్లలను పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, రాష్ట్ర ప్రభుత్వం సాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. 

గాల్వాన్ అమర వీరుల కుటుంబాలకు ఆర్ధికసాయం చేయడం తప్పుకాదు కానీ ఇక్కడ తెలంగాణలో అమర జవాన్ యాదయ్య కుటుంబానికి ఇచ్చిన హామీని పట్టించుకోకుండా, సిఎం కేసీఆర్‌ బిహార్‌ వెళ్ళి అక్కడ చెక్కులు పంచిపెడుతుండటం సరికాదు. ముందు తెలంగాణకు చెందిన అమర జవాన్ల కుటుంబాలను, ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.