ముందు రాష్ట్రానికి సమాధానం చెప్పుకొని దేశాటన చేయండి

కామారెడ్డి పట్టణంలో గురువారం జరిగిన బిజెపి సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసీఆర్‌ కేంద్రంపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా జవాబు చెప్పారు. “మిగులు బడ్జెట్‌తో చేతికి అందిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కేవలం 8 ఏళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రంలో పుట్టిన ప్రతీ బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉంది. 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను బడ్జెట్‌లో చూపడం లేదు. అసెంబ్లీకి తెలియనీయకుండా దాచిపెడుతున్నారు. బడ్జెట్‌లో చూపినదాని కంటే చాలా ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. ఎంతగా అంటే ఎఫ్ఆర్‌ఎంబీ పరిధికి మించి అప్పులు చేస్తున్నారు. 

ఓ వైపు ఇన్ని అప్పులు చేస్తున్నా ఎన్నికలలో హామీ ఇచ్చిన లక్ష రూపాయల పంటరుణాల మాఫీ ఇంతవరకు నెరవేర్చనేలేదు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా పధకం తెస్తే దానినీ అమలుచేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని పధకాలకు సొంత పేర్లు పెట్టుకొని వాటిని తెలంగాణ ప్రభుత్వమే ఇస్తునట్లు చెప్పుకొంటోంది. మన ఊరు-మన బడి ఇందుకు ఉదాహరణ. ఆయుష్మాన్ భారత్‌లో చేరితే వాస్తవాలు బయటకొస్తాయని దానిని అమలుచేయడం లేదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచేసి రూ.1.20 లక్షల కోట్లకు చేర్చారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తున్నా పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్ అబద్దాలు చెపుతున్నారు. సంక్షేమ పధకాలకు నిధులు, రాష్ట్రానికి అప్పులు తీసుకొంటున్నప్పుడు వాటి గురించి అడిగే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఎవరూ ప్రశ్నించకూడదని కేసీఆర్‌ భావిస్తారు. 

కేవలం 8 ఏళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మునిగిపోయేలా చేసిన కేసీఆర్‌, ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేయవలసి వచ్చిందో, ఆ సొమ్మంతా ఎక్కడకి పోయిందో రాష్ట్ర ప్రజలకు వివరించిన తర్వాత దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరితే బాగుంటుంది,” అని ఆక్షేపించారు.