
బుదవారం బిహార్ రాజధాని పాట్నాలో కేసీఆర్, నితీశ్ కుమార్ భేటీ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ సుదీర్గంగా ప్రసంగించారు. ఆ తర్వాత ఓ అనూహ్యమైన ఘటన జరిగింది. ఓ విలేఖరి “మీ కూటమికి నితీశ్ కుమార్‌ని నాయకుడిగా ప్రతిపాదిస్తారా?” అని ప్రశ్నించగా “నితీశ్ కుమార్ పేరు ప్రతిపాదించడానికి నేనెవరిని?” అంటూ కేసీఆర్ సమాధానం దాటవేయబోయారు. ఆ మాట వినగానే నితీశ్ కుమార్ కుర్చీలో నుంచి లేచిపోయారు. అప్పుడు కేసీఆర్ విలేఖరులకు సమాధానం చెపుతూనే, నితీశ్‌జీ బైటీయే... బైటీయే అంటూ పలుమార్లు కోరారు. అయినా నితీశ్ కుమార్ కూర్చోలేదు.
తెలంగాణలో బిజెపి నేతలు ఇప్పుడు ఇదే ప్రస్తావిస్తూ, “అధికారం కోసం చేతులు కలిపిన కేసీఆర్, నితీశ్ కుమార్ అవకాశవాదం ఒకే ఒక్క ప్రశ్నతో బయటపడిపోయింది,” అని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో కూడా ప్రత్యామ్నాయ కూటములు ఏర్పాటు చేసినప్పుడు, ఎవరు నాయకత్వం, ఎవరికి ప్రధానమంత్రి పదవి దక్కాలనే ఒకే ఒక కారణంతో విఫలమయ్యాయి. ఇప్పుడూ మళ్ళీ అదే జరుగబోతుందా?అంటే కావచ్చు.
ఎందుకంటే కేసీఆర్ ప్రధానమంత్రి చేపట్టి దేశాన్ని గాడిలో పెట్టాలనుకొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో నితీశ్ కుమార్‌తో సహా మరో డజను మంది ప్రధానమంత్రి పదవి చేపట్టాలని కలలు కంటున్నారు. కనుక ముందుగా దీని గురించి తేల్చుకొన్నాక కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే మంచిది. లేకుంటే ఆయన కష్టం అంతా ఏట్లో పిండిన చింతపండే అవుతుంది.