కడియం అన్ని ఆస్తులు ఎలా సంపాదించారు? ఎమ్మెల్యే రాజయ్య

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మద్య విభేదాలు ప్రెస్‌మీట్‌లు పెట్టుకొని బహిరంగంగా విమర్శించుకొనే స్థాయికి వచ్చింది. 

జిల్లాలో చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ, “టిడిపి హయాంలో కడియం శ్రీహరి నియోజకవర్గంలోని 361 మంది అమాయకులపై నక్సలైట్ల ముద్రవేసి పోలీసులతో భూటకపు ఎన్‌కౌంటర్ చేయించి చంపించేశాడు,” అని ఆరోపించారు.

మర్నాడే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి రాజయ్య ఆరోపణలను తిప్పి కొడుతూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

వాటిపై రాజయ్య కూడా వెంటనే స్పందించారు. మంగళవారం సాయంత్రం హనుమకొండలోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ , “కడియం శ్రీహరి అవినీతి భాగోతాలు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఎమ్మెల్యేకాక మునుపు ఆయన ఆస్తులెన్ని? ఇప్పుడు ఆయన ఆస్తులెన్ని? ఆయన ఇప్పుడు ఉంటున్న పెద్దఇల్లు ఎలా వచ్చింది?ఏ బడా కాంట్రాక్టర్‌ చేత కట్టించుకొన్నాడు?ఇన్ని పెట్రోల్ బంకులు ఎలా సంపాదించాడు?ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు?చెప్పగలాడా?మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదు కానీ ఆస్తులు సంపాదించుకొన్నాడు. ఆయన అవినీతి గురించి ఏ టిడిపి కార్యకర్తని అడిగినా చెపుతాడు. అతనిపై నేను చేసిన ఈ ఆరోపణలన్నిటికీ నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాటిని బయటపెడితే ఆయన నియోజకవర్గంలో కాలు పెట్టలేడు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాటిని బయటపెడతా. ఆయన టిఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అవునన్నా కాదన్నా స్టేషన్ ఘన్‌పూర్‌ నా అడ్డా... నా గడ్డ,” అని ఎమ్మెల్యే రాజయ్య ఘాటుగా సమాధానం చెప్పారు. 

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరులో ఇద్దరూ ఎంత అవినీతిపరులో, ఎటువంటి తప్పులు చేశారో వారే బయటపెట్టుకొన్నారు. ఇద్దరూ అవినీతిపరులే, తమ వద్ద సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని వారే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పుకొన్నారు కనుక సిఎం కేసీఆర్‌ఇద్దరినీ పార్టీలో తొలగించగలరా?లేకుంటే వారి అవినీతిపరులని తెలిసి ఉన్నప్పటికీ పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నట్లవుతుంది. 

టిడిపి హయాంలో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు 361 మంది అమాయకులను పోలీసులతో భూటకపు ఎన్‌కౌంటర్ చేయించాడని ఎమ్మెల్యే హోదాలో ఉన్న రాజయ్య ప్రెస్‌మీట్‌లో చెప్పారు కనుక హైకోర్టు దీనిని సుమోటుగా స్వీకరించి విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయగలిగితే బాగుంటుంది.